Search form

1 థెస్సలొనీకయులకు 2

ఆదర్శ సేవకుడు, అతని ప్రతిఫలం

1సోదరులారా, మీ దగ్గరికి మేము రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు. 2మేము ఫిలిప్పీలో ముందుగా హింసనూ అవమానాన్నీ అనుభవించాం అని కూడా మీకు తెలుసు. పోరాటాల మధ్య దేవునిలో ధైర్యం తెచ్చుకొని దేవుని సువార్తను మీకు ఉపదేశించాము.

3ఎందుకంటే మా ఉపదేశం తప్పు దారి పట్టించేదీ అపవిత్రమైనదీ ద్రోహపూరితమైనదీ కాదు. 4దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచి సువార్తను మాకు అప్పగించాడు. కాబట్టి మేము మనుషుల్ని సంతోషపరచడానికి కాకుండా హృదయాలను పరిశీలించే దేవుణ్ణి సంతోషపరచడానికే మాట్లాడుతున్నాము.

5మేము ముఖస్తుతి మాటలు ఏనాడూ పలకలేదని మీకు తెలుసు. అలాగే అత్యాశను కప్పిపెట్టే వేషాన్ని ఎప్పుడూ వేసుకోలేదు. దీనికి దేవుడే సాక్షి. 6ఇంకా మేము యేసుక్రీస్తు అపొస్తలులం కాబట్టి ఆధిక్యతలు ప్రదర్శించడానికి అవకాశం ఉన్నా మీ వల్ల కానీ, ఇతరుల వల్ల కానీ, మనుషుల వల్ల కలిగే ఏ ఘనతనూ మేము ఆశించలేదు.

7పాలిచ్చే తల్లి తన పసిపిల్లలను సాకినట్టు మేము మీతో మృదువుగా వ్యవహరించాం. 8మీరు మాకు ఎంతో ఇష్టమైనవారు కాబట్టి మీ పట్ల ప్రీతితో దేవుని సువార్త మాత్రమే కాదు, మీ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.

9సోదరులారా, మా ప్రయాస, కష్టం మీకు జ్ఞాపకముంది కదా! మీకు దేవుని సువార్త ప్రకటించేటప్పుడు మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టపడి పని చేశాం. 10విశ్వాసులైన మీ ముందు మేము ఎంత పవిత్రంగా, నీతిగా, నిందారహితంగా నడచుకున్నామో దానికి మీరే సాక్షులు. దేవుడు కూడా సాక్షి.

11తన రాజ్యానికీ, మహిమకూ మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు ఉండాలని మేము మీలో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ సాక్ష్యం ఇస్తూ 12తండ్రి తన పిల్లలతో వ్యవహరించే విధంగా మేము మీ పట్ల వ్యవహరించామని మీకు తెలుసు.

13మీరు మొదట మా నుండి దేవుని వాక్కు అయిన సందేశాన్ని స్వీకరించినప్పుడు దాన్ని మనుషుల మాటగా కాక దేవుని వాక్కుగా అంగీకరించారు. ఆ కారణం చేత మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు స్వీకరించిన ఆ సందేశం నిజంగా దేవుని వాక్కే. అది విశ్వసించిన మీలో పని చేస్తూ ఉంది కూడా. 14ఎలాగంటే సోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసులో ఉన్న దేవుని సంఘాలను పోలి నడచుకుంటున్నారు. వారు యూదుల వలన అనుభవించిన హింసలే ఇప్పుడు మీరు కూడా మీ స్వదేశీయుల వలన అనుభవిస్తున్నారు.

15వారు ప్రభువైన యేసునూ ప్రవక్తలనూ చంపారు. మమ్మల్ని తరిమివేశారు. వారు దేవుణ్ణి సంతోషపెట్టేవారు కాదు. మనుషులందరికీ విరోధులు. 16యూదేతరులకు రక్షణ కలిగించే సువార్తను ప్రకటించకుండా వారు మమ్మల్ని అడ్డుకున్నారు. తమ పాపాలను పెంచుకుంటూ ఉన్నారు. చివరికి దేవుని తీవ్ర కోపం వారి మీదికి వచ్చింది.

17సోదరులారా, మేము కొంతకాలం హృదయం విషయంలో కాకున్నా శరీర రీతిగా దూరంగా ఉన్నాము. అందుచేత మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని గొప్ప ఆశతో ఉన్నాం.

18కాబట్టి మేము మీ దగ్గరికి రావాలనుకున్నాం. పౌలు అనే నేను ఎన్నోసార్లు రావాలనుకున్నాను గానీ సాతాను మమ్మల్ని ఆటంకపరిచాడు. 19ఎందుకంటే భవిష్యత్తు కొరకైన మా ఆశా, ఆనందమూ, మా అతిశయ కిరీటం ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయంలో ఆయన సన్నిధిలో నిలిచే మీరే కదా! 20నిజంగా మా మహిమా ఆనందమూ మీరే.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index