Search form

1 థెస్సలొనీకయులకు 3

ఆదర్శ సోదరుడు. విశ్వాసి పవిత్రీకరణ

1కాబట్టి ఇక ఆగలేక ఎతెన్సులో మేము ఒంటరిగానైనా ఉండడం మంచిదే అని నిశ్చయించుకొని 2-3ఈ హింసల మూలంగా మీలో ఎవరూ చెదరిపోకుండా విశ్వాసం విషయంలో మిమ్మల్ని ఆదరించడానికీ బలపరచడానికీ మన సోదరుడూ క్రీస్తు సువార్త విషయంలో దేవుని సేవకుడూ అయిన తిమోతిని మీ దగ్గరికి పంపించాం. ఈ కష్టాలు అనుభవించాలని దేవుడే నియమించాడని మీకు తెలుసు.

4మేము మీ దగ్గర ఉన్నప్పుడు “మనం హింసలు పొందాలి” అని ముందుగానే మీతో చెప్పాం కదా! మీకు తెలిసినట్టుగానే ఇప్పుడు అలా జరుగుతూ ఉంది. 5అందుకే ఇక నేను కూడా ఉండబట్టలేక ఒకవేళ దుష్ట ప్రేరకుడు మిమ్మల్ని ప్రేరేపించాడేమో అనీ, మా ప్రయాస అంతా వ్యర్థమై పోయిందేమో అనీ మీ విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోడానికి తిమోతిని పంపాను.

6ఇప్పుడు అతడు మీ దగ్గర నుండి తిరిగి వచ్చి మీ విశ్వాస ప్రేమలను గురించి మాకు తెలియజేశాడు. మేము మిమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నట్టే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నారనీ, మమ్మల్ని ఎప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారనీ మీ గురించి సంతోషకరమైన వార్త అతడు తీసుకుని వచ్చాడు.

7అందుచేత సోదరులారా, మీ విశ్వాసం చూసి మా ఇబ్బందులన్నిటిలో హింసలన్నిటిలో ఆదరణ పొందాం. 8ఎందుకంటే మీరు ప్రభువులో నిలకడగా ఉంటే మా జీవితం సార్థకం అయినట్టే. 9మీ గురించీ, దేవుని ఎదుట మీ విషయంలో మాకు కలిగే ఆనందం గురించి దేవునికి మేము ఏమని కృతజ్ఞతలు చెల్లించగలం?

10మీ ముఖాలు చూడాలనీ, మీ విశ్వాసంలో కొరతగా ఉన్నవాటిని సరిచేయాలనీ రాత్రింబగళ్ళు ప్రార్థనలో వేడుకుంటున్నాం 11మన తండ్రి అయిన దేవుడూ, మన ప్రభు యేసూ మమ్మల్ని మీ దగ్గరికి ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకువచ్చు గాక!

12మీ పట్ల మా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతూ వర్థిల్లుతూ ఉన్నదో అలాగే మీరు కూడా ఒకరిపట్ల ఒకరు, ఇంకా, అందరి పట్ల కూడా ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లేలా ప్రభువు అనుగ్రహించు గాక. 13తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితంగా ఉండేలా ప్రభువు స్థిరపరచు గాక!

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index