Search form

1 తిమోతికి 1

ధర్మ శాస్త్రపరమైన, పనికిమాలిన బోధ ఖండన

1విశ్వాస విషయంలో నా నిజ కుమారుడు తిమోతికి మన రక్షకుడైన దేవుని సంకల్పానుసారం, మన ఆశాభావం అయిన క్రీస్తు యేసు ఆజ్ఞ ప్రకారం అపొస్తలుడైన పౌలు రాస్తున్న సంగతులు. 2తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభువైన క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగు గాక.

3నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్టుగా నువ్వు ఎఫెసులోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించే వారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి. 4అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు. 5ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.

6కొంతమంది వీటి నుండి తొలగిపోయి పనికిమాలిన కబుర్లకు దిగారు. 7వారు మాట్లాడేవీ నొక్కి చెప్పేవీ వారికే అర్థం కాకపోయినా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటారు. 8అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు.

9దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ 10వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.

11ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు. 12నన్ను బలపరచి, నమ్మకమైన వాడుగా ఎంచి తన సేవకు నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞుణ్ణి. 13అంతకు ముందు దేవ దూషకుణ్ణి, హింసించేవాణ్ణి, హానికరుణ్ణి. అయితే తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరం పొందాను. 14మన ప్రభువు తన ధారాళమైన కృపను నాపై కుమ్మరించి, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ విశ్వాసాలను అనుగ్రహించాడు. 15పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.

16అయినా నిత్యజీవం కోసం తనపై విశ్వాసముంచబోయే వారికి నేను ఒక నమూనాగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో కనుపరచేలా నన్ను కరుణించాడు. 17అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్‌.

18తిమోతీ, నా కుమారా, గతంలో నిన్ను గూర్చి చెప్పిన ప్రవచనాలకు అనుగుణంగానే ఈ సూచనలు నీకు ఇస్తున్నాను. వాటిని పాటిస్తే నీవు మంచి పోరాటం చేయగలుగుతావు. 19అలాటి మనస్సాక్షిని కొందరు నిరాకరించి, విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్నారు. 20వారిలో హుమెనై, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ మానుకొనేలా వీరిని సాతానుకు అప్పగించాను.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index