Search form

2 కొరింథీయులకు 1

కార్యాచరణలో పౌలు పద్ధతులు - వివరణ

1కొరింతులోని దేవుని సంఘానికీ అకయ ప్రాంతమంతటా ఉన్న పరిశుద్ధులందరికీ దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు అయిన పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న విషయాలు. 2మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక. 3మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.

4ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.

5క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది. 6మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.

7మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే మా ఆదరణ కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీ గురించి మాకు దృఢమైన ఆశాభావం ఉంది. 8సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మేము బతుకుతామనే నమ్మకం లేక, మా శక్తికి మించిన భారంతో పూర్తిగా కుంగిపోయాము.

9వాస్తవంగా, మాకు మరణదండన విధించినట్టు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది. 10ఆయన అలాటి భయంకరమైన ఆపద నుండి మమ్మల్నిరక్షించాడు, మళ్లీ రక్షిస్తాడు. ఆయన మీద మా నమ్మకం పెట్టుకున్నాము. మళ్ళీ మళ్ళీ ఆయన మమ్మల్ని తప్పిస్తాడు. 11మా కోసం మీరు ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ ఉంటే ఆయన దీన్ని చేస్తాడు. చాలామంది ప్రార్థనల వల్ల దేవుడు మమ్మల్ని కనికరించినందుకు ఎంతోమంది మా తరపున కృతజ్ఞత చెబుతారు.

12మా అతిశయం ఇదే! దీనికి మా మనస్సాక్షి సాక్ష్యం. లౌకిక జ్ఞానంతో కాక దేవుడు ప్రసాదించే సదుద్దేశంతో యథార్థతతో దేవుని కృపనే అనుసరించి, లోకంలో మరి ముఖ్యంగా మీ పట్ల నడుచుకున్నాము. 13మీరు చదివి అర్థం చేసుకోలేని సంగతులేవీ మీకు రాయడం లేదు. 14మీరు ఇప్పటికే కొంతవరకూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు. కడవరకూ అర్థం చేసుకుంటారని ఆశాభావంతో ఉన్నాం. మన యేసు ప్రభువు దినాన, మీరు మాకూ, మేము మీకూ గర్వ కారణంగా ఉంటాం. 15ఈ నమ్మకంతో నేను మొదట మీ దగ్గరికి రావాలనుకున్నాను. దీనివలన మీకు రెండు సార్లు ప్రయోజనం కలగాలని నా ఉద్దేశం.

16మాసిదోనియకు వెళ్తూ ఉన్నపుడు మిమ్మల్ని కలుసుకుని మాసిదోనియ నుండి మళ్ళీ మీ దగ్గరికి రావాలనీ, తరువాత మీరు నన్ను యూదయకు సాగనంపగలరనీ అనుకున్నాను. 17నేను ఇలా ఆలోచించి చపలచిత్తంగా నడచుకున్నానా? నేను “అవును, అవును” అన్న తరువాత, “కాదు, కాదు” అంటూ లౌక్యంగా ప్రవర్తిస్తున్నానా? 18అయితే దేవుడు నమ్మదగినవాడు. మేము, “అవును” అని చెప్పి, “కాదు” అనం. 19నేనూ, సిల్వానూ, తిమోతీ, మీకు ప్రకటించిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు “అవును” అని చెప్పి, “కాదు” అనేవానిగా ఉండలేదు. ఆయన ఎప్పుడూ, “అవును” అనేవానిగానే ఉన్నాడు. 20దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో, “అవును” గానే ఉన్నాయి. కాబట్టి దేవుని మహిమ కోసం ఆయన ద్వారా మనం, “ఆమెన్” అంటున్నాం.

21క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనల్ని అభిషేకించి 22మనం తన వాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు, మన హృదయాల్లో తన ఆత్మను హామీగా ఇచ్చాడు.

23మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేక నేను కొరింతుకు మళ్ళీ రాలేదు. దీనికి దేవుడే నా సాక్షి. 24మీ విశ్వాసం మీద పెత్తనం చెలాయించే ఉద్దేశం మాకు లేదు. మీరు మీ విశ్వాసంలో నిలిచి ఉండగా మీ ఆనందం కోసం మీతో కలిసి పని చేస్తున్నాము.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index