Search form

2 కొరింథీయులకు 12

1నేను అతిశయించాలి, అయితే దాని వలన ప్రయోజనమేమీ రాదు. ప్రభువు దర్శనాలూ ప్రత్యక్షతలూ మీకు తెలియజేస్తాను.

2క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశానికి కొనిపోయాడు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. 3అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. 4దేవుడు అతణ్ణి ఆనంద నివాసంలోకి కొనిపోయాడు. అతడక్కడ ఎవరూ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన విషయాలు విన్నాడు.

5అలాంటి వ్యక్తి తరపున నేను అతిశయిస్తాను. అయితే నా బలహీనతల విషయంలో తప్ప నా తరపున నేను అతిశయించను. 6ఒకవేళ అతిశయించాలనుకొన్నా అది తెలివి తక్కువతనమేమీ కాదు. ఎందుకంటే నేను సత్యమే చెబుతున్నాను. కానీ ఎవరైనా నాలో చూసినదాని కంటే, నేను చెప్పింది విన్నదాని కంటే నన్ను ఎక్కువ ఘనంగా ఎంచకుండా ఉండేలా అతిశయించడం మానుకుంటాను.

7నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. 8అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను. 9అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

10బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.

11నేను బుద్ధిహీనుడినయ్యాను! మీరే నన్ను బలవంతం చేశారు. వాస్తవానికి మీరు నన్ను మెచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే నేను వట్టివాడినైనా ఆ “గొప్ప అపొస్తలుల” కంటే ఏ మాత్రం తక్కువ వాణ్ణి కాను. 12నాలో అసలైన అపొస్తలుని గురుతులు ఎంతో సహనంతో మీ మధ్య దేవుడు కనిపింపజేశాడు. సూచకక్రియలూ అద్భుతాలూ మహత్కార్యాలూ కనపరిచాడు. 13నేను మీకు భారంగా లేను అనే విషయంలో తప్ప, ఇతర సంఘాలకంటే మీరు ఏ విషయంలో తక్కువ వారయ్యారు? ఈ నా తప్పు క్షమించండి మరి!

14ఇప్పుడు ఈ మూడవసారి మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీకేముందో అది నాకు అక్కరలేదు. నాకు మీరే కావాలి. తల్లిదండ్రుల కోసం పిల్లలు దాచరు. కానీ తల్లిదండ్రులే పిల్లల కోసం దాచాలి. 15కాబట్టి మీ ఆత్మల కోసం ఎంతో ఆనందంగా ఖర్చు చేస్తాను. మీకోసం ఖర్చయిపోతాను. నేను మిమ్మల్ని అంత ఎక్కువగా ప్రేమిస్తుంటే మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమిస్తారా?

16అదలా ఉంచండి. నేను మీకు భారంగా ఉండలేదు గానీ నేను యుక్తిగా మాయోపాయం చేత మిమ్మల్ని పట్టుకున్నాను అని చెబుతారేమో! 17నేను మీ దగ్గరికి పంపినవారి ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకున్నానా? 18మీ దగ్గరికి వెళ్ళమని తీతును ప్రోత్సహించాను. అతనితో వేరొక సోదరుని పంపాను. తీతు మీ దగ్గర ఏమైనా సంపాదించాడా? మేము ఏక మనసుతో ఏక విధానంతో ప్రవర్తించలేదా?

హెచ్చరిక

19మేమింత వరకూ మా పక్షంగా మేము వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో క్రీస్తును బట్టి మీ క్షేమాభివృద్ధి కోసం ఇవన్నీ చెబుతున్నాం. 20ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టులుగా ఉండరేమో అనీ, నేను మీకు ఇష్టుడనుగా ఉండనేమో అని భయపడుతున్నాను. కలహాలు, అసూయ, క్రోధాలు, కక్షలు, వదంతులు, గర్వం, అల్లర్లు ఉంటాయేమో. 21నేను తిరిగి వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చుతాడేమో అనీ, గతంలో పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, ఇంద్రియలోలత్వం విషయంలో పశ్చాత్తాపం పొందని అనేకుల గురించి దుఖించాల్సి వస్తుందేమో అనీ భయపడుతున్నాను.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index