Search form

2 కొరింథీయులకు 7

1ప్రియమైన కొరింతు విశ్వాసులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి, కాబట్టి దేవుని మీద భయభక్తులతో పరిపూర్ణమైన పరిశుద్ధత కోసం తపన పడుతూ దేహానికీ ఆత్మకూ అంటిన మురికినంతా కడుక్కుందాం.

పౌలు హృదయం

2మమ్మల్ని మీ హృదయాల్లో చేర్చుకోండి. మేమెవరికీ హాని చేయలేదు. ఎవరికీ అపకారం తలపెట్టలేదు. ఎవరినీ స్వార్థానికి వినియోగించుకోలేదు. 3మీమీద నింద మోపాలని నేనిలా అనడం లేదు. మీరు మా హృదయాల్లో ఉన్నారు. మీతో పాటు చావడానికైనా జీవించడానికైనా సిద్ధంగా ఉన్నామని నేను ముందే చెప్పాను.

4నేను చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీ గురించి నేనెంతో గర్విస్తున్నాను. నిండు ఓదార్పుతో ఉన్నాను. మాకు బాధలెన్నున్నా సరే ఆనందంతో పొంగి పోతున్నాను. 5మేము మాసిదోనియ వచ్చినప్పుడు మా శరీరాలకు ఎంత మాత్రం విశ్రాంతి దొరకలేదు. అన్నివైపులా మాకు కష్టాలే. బయట పోరాటాలు, లోపల భయాలు ఉన్నాయి.

6కానీ కృంగిన వారిని ఆదరించే దేవుడు, తీతు రాక ద్వారా మమ్మల్ని ఆదరించాడు. 7తీతు రాక వలన మాత్రమే కాక, అతడు మీ దగ్గర పొందిన ఆదరణ వలన కూడా దేవుడు మమ్మల్ని ఆదరించాడు. నాపై ఉన్న మీ అభిమానం, నా పట్ల మీ దుఃఖం, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలియజేశాడు. కాబట్టి నేను మరెక్కువగా ఆనందించాను.

8నా లేఖ మీకు దుఃఖం కలిగించినా, అది రాసినందుకు నేను బాధ పడటం లేదు. అది మీకు కొంత దుఃఖం కలిగించిందని నాకు తెలుసు. అది నాకు కూడా దుఃఖం కలిగించింది. అయినా అది కొంచెం సేపు మాత్రమే. 9కాని ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీరు విచారించారని ఆనందించడం లేదు గానీ మీ విచారం పశ్చాత్తాపపడేలా చేసింది. మీరు దైవిక విచారాన్ని అనుభవించారు. అందువల్ల మా వలన ఎలాంటి నష్టమూ మీరు పొందలేదు.

10దైవిక విచారం పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దాని వలన విచారం కాదు, రక్షణ లభిస్తుంది. అయితే లోకానుసారమైన విచారం చావును తెస్తుంది. 11దైవిక విచారం మీలో ఎలాంటి పట్టుదల తెచ్చిందో చూడండి. మీరు నిర్దోషులని రుజువు చేసే ఎలాంటి గొప్ప పట్టుదల, ఎలాంటి రోషం, ఎలాంటి భయభక్తులు, ఎలాంటి తపన, ఎలాంటి ఆసక్తి, ప్రతి దానిలో న్యాయం తప్పక జరగాలనే ఎలాంటి ఆశ, మీలో కలిగాయో చూడండి! ఆ విషయంలో అన్ని విధాలుగా మీరు నిర్దోషులని నిరూపించుకున్నారు. 12నేను మీకు రాసినా ఆ చెడ్డ పని చేసినవాడి కోసం రాయలేదు. వాడి వలన అన్యాయం పొందిన వాడి కోసం కూడా రాయలేదు. అయితే మా పట్ల మీకున్న ఆసక్తి దేవుని దృష్టిలో మీకు తెలియడానికే రాశాను.

13వీటన్నిటితో మాకెంతో ప్రోత్సాహం లభించింది. అంతే కాదు, తీతు పొందిన ఆనందం ద్వారా మాకు మరెక్కువ ఆనందం కలిగింది. మీ అందరి వలన అతని ఆత్మకు ఊరట కలిగింది. 14ఎందుకంటే నేనతనికి మీ గురించి గొప్పగా చెప్పిన విషయాల్లో మీరు నన్ను సిగ్గుపరచలేదు. దీనికి భిన్నంగా మేము మీతో చెప్పినదంతా ఎలా వాస్తవమో అలాగే మేము మీ గురించి తీతుకు గొప్పగా చెప్పినదంతా వాస్తవమని తేలింది. 15మీరు అతన్ని భయంతో, వణుకుతో చేర్చుకొని విధేయత చూపిన సంగతి జ్ఞాపకం చేసుకున్నపుడు అతనికి మీ పట్ల ప్రేమ అధికమయ్యింది. 16ప్రతి విషయంలో మీ గురించి నాకు ఉన్న నమ్మకాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index