Search form

2 తిమోతికి 4

విశ్వాసపాత్రుడైన సేవకుడు

1దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షత, తన రాజ్యం వచ్చేటప్పుడు బతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నిన్ను ఆదేశిస్తున్నాను.

2వాక్యాన్ని బోధించు, అనుకూలమైనా, కాకపోయినా సిద్ధంగా ఉండు. ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా సంపూర్ణమైన సహనంతో ఉపదేశించు.

3ఎందుకంటే మనుషులు మంచి బోధను సహించలేని సమయం రాబోతోంది. దురద చెవులతో తమ స్వంత దురాశలకు అనుగుణంగా బోధించే వారిని పోగుచేసుకుని, 4సత్యం నుండి తొలిగిపోయి కట్టు కథల వైపు మళ్ళుతారు.

5నీవు మాత్రం అన్ని విషయాల్లో సంయమనంతో ఉండి, కష్టాలు భరించు. సువార్త ప్రచారకుని పనిచెయ్యి, నీ పరిచర్యను సంపూర్తి చెయ్యి.

6ఒక పానార్పణగా నేను బలి అవుతూ ఉన్నాను. నా మరణం సమీపించింది. 7మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. 8ఇప్పుడు నా కోసం నీతికిరీటం సిద్ధంగా ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు దాన్ని ఆ రోజున నాకు అనుగ్రహిస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షానికై ప్రేమతో ఎదురుచూసే వారందరికీ అనుగ్రహిస్తాడు.

9నా దగ్గరికి త్వరగా రావడానికి ప్రయత్నించు. 10దేమా ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టి తెస్సలోనిక వెళ్ళిపోయాడు. క్రేస్కే గలతియకీ, తీతు దల్మతియకీ వెళ్ళారు. 11లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. మార్కును తీసుకురా. అతడు పరిచారం కోసం నాకు ఉపయోగంగా ఉంటాడు. 12తుకికును ఎఫెసుకు పంపాను.

13నువ్వు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు దగ్గర ఉంచి వచ్చిన అంగీనీ, పుస్తకాలనూ, ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసుకు రా. 14అలెగ్జాండర్ అనే కంసాలి నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియలకు తగిన ప్రతిఫలం ప్రభువే ఇస్తాడు. 15అతని విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అతడు మా బోధను తీవ్రంగా ఎదిరించాడు.

16నేను మొదట న్యాయస్థానం ఎదుట వాదించుకున్నపుడు నా పక్షంగా ఎవరూ నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరం కాకుండా ఉండు గాక.

17అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దాన్ని వినేందుకూ ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు. 18ప్రభువు అన్ని చెడుపనుల నుండీ నన్ను తప్పించి సురక్షితంగా తన పరలోక రాజ్యం చేరుస్తాడు. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక, ఆమేన్‌.

19ప్రిస్కకూ అకులకూ ఒనేసిఫొరు కుటుంబానికీ నా అభివందనాలు. 20ఎరస్తు కొరింథులో ఆగిపోయాడు. త్రోఫిముకు జబ్బు చేసింది. అందుకే అతణ్ణి మిలేతులో విడిచి వచ్చాను.

21నీవు చలికాలం రాకముందే రావడానికి ప్రయత్నం చేయి. యుబూలు, పుదే, లీను, క్లౌదియ, ఇతర సోదరులంతా నీకు వందనాలు చెబుతున్నారు.

22ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండు గాక. కృప మీకు తోడై ఉండు గాక.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index