Search form

అపొస్తలుల కార్యములు 14

ఈకొనియలో పరిచర్య

1ఈకొనియలో ఏం జరిగిందంటే, పౌలు, బర్నబాలు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులూ గ్రీకులూ విశ్వసించారు. 2అయితే అవిధేయులైన యూదులు యూదేతరులను రెచ్చగొట్టి వారి మనసుల్లో సోదరుల మీద ద్వేషం పుట్టించారు.

3పౌలు, బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాటలాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిద్వారా సూచకక్రియలనూ మహత్కార్యాలనూ చేయించి తన కృపా సందేశాన్ని రుజువు చేశాడు. 4ఆ పట్టణంలోని జనసమూహంలో భేదాలు వచ్చి కొందరు యూదుల పక్షం, మరి కొందరు అపొస్తలుల పక్షం చేరారు. 5యూదేతరులూ యూదులూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాలను బాధించి రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నారు.

6వారు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకూ చుట్టుపక్కల ప్రదేశానికీ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు.

లుస్త్ర, దెర్బే పట్టణాల్లో

7లుస్త్రలో కాళ్ళు చచ్చుబడిన ఒకడున్నాడు. 8అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు. 9అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసమున్నదని గమనించి, 10“లేచి నిలబడు” అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు.

11ప్రజలు పౌలు చేసిన దాన్ని చూసి, లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు” అని కేకలు వేసి, 12బర్నబాకు జూస్ అనీ, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మే అనీ పేర్లు పెట్టారు. 13పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లనూ పూల దండలనూ పట్టణ ముఖద్వారం దగ్గరకి తీసుకుని వచ్చి సమూహంతో కలిసి, వారికి బలి అర్పించాలని చూశాడు.

14అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకొని సమూహంలోకి చొరబడి 15“అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. 16ఆయన గతించిన కాలాల్లో మనుషులందరినీ తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు. 17అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువులనూ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్ష్యం నిలిపి ఉంచాడు.”

18వారు ఆ విధంగా ఎంతగా చెప్పినా సరే, తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం చాలా కష్టమయింది.

లుస్త్రలో పౌలును రాళ్ళతో కొట్టడం

19అంతియొకయ, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనాన్ని తమ వైపు తిప్పుకొని, పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడనుకొని పట్టణం బయటికి అతనిని ఈడ్చివేశారు. 20అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, మరుసటి రోజు బర్నబాతో కూడ దెర్బేకు వెళ్ళిపోయాడు.

21వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి చాలా మందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వచ్చారు. 22శిష్యుల మనసులను దృఢపరచి, విశ్వాసంలో నిలకడగా ఉండాలనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక హింసలు పొందాలనీ వారిని ప్రోత్సహించారు.

సంఘాల్లో పెద్దలను నియమించడం. అంతియొకయకు తిరిగి రాక

23ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు. 24తరువాత పిసిదియ ప్రాంతమంతటా సంచరించి పంఫూలియ వచ్చారు.

25పెర్గేలో వాక్కు బోధించి, అత్తాలియ వెళ్ళారు. 26అక్కడ నుండి ఓడ ఎక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తం మొదట దేవుని కృపకు అప్పగించుకొని, బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చారు. 27వారు వచ్చి సంఘాన్ని సమకూర్చి, దేవుడు తమకు తోడై చేసిన పనులన్నిటినీ, యూదేతరులు విశ్వసించడానికి ఆయన ద్వారం తెరచిన సంగతీ వివరించారు.

28ఆ తరువాత వారు శిష్యుల దగ్గర చాలాకాలం గడిపారు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index