Search form

అపొస్తలుల కార్యములు 15

యెరూషలేము పెద్దల సభ: సున్నతి గురించి చర్చ

1యూదయ నుండి కొందరు వచ్చి, “మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని మీకు రక్షణ లేదు” అని విశ్వాసులకు బోధిస్తూ ఉన్నారు.

2పౌలుకు, బర్నబాకు వారితో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ సమస్య గురించి పౌలు బర్నబాలు, ఇంకా మరి కొంతమంది యెరూషలేములోని అపొస్తలుల, పెద్దల దగ్గరికి వెళ్ళాలని సోదరులు నిశ్చయించారు. 3కాబట్టి సంఘం వారిని సాగనంపగా, వారు ఫేనీకే, సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియజేసి సోదరులందరికి మహానందం కలగజేశారు.

4వారు యెరూషలేము చేరగానే సంఘం, అపొస్తలులూ పెద్దలూ వారికి స్వాగతం పలికారు. దేవుడు తమకు తోడై చేసిన వాటన్నిటినీ వారు వివరించారు. 5పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, యూదేతరులకు సున్నతి చేయించాలనీ, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేలా వారికి ఆజ్ఞాపించాలనీ చెప్పారు.

6అప్పుడు అపొస్తలులూ పెద్దలూ ఈ సంగతి గూర్చి ఆలోచించడానికి సమావేశమయ్యారు. చాలా చర్చ జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇలా అన్నాడు,

క్రైస్తవ స్వేచ్ఛకు అనుకూలంగా పేతురు వాదం

7“సోదరులారా, యూదేతరులు నా నోట సువార్త విని విశ్వసించేలా మీలో నుండి నన్ను ఆరంభ దినాల్లో దేవుడు ఎన్నుకున్నాడని మీకు తెలుసు. 8హృదయాలను ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినట్టే, వారికీ ఇచ్చి, తాను వారిని స్వీకరించినట్టుగా వెల్లడి పరిచాడు. 9మనకీ వారికీ ఏ తేడా చూపకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచాడు. 10కాబట్టి మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు? 11ప్రభువైన యేసు కృప ద్వారా మనం రక్షణ పొందుతామని మనం నమ్ముతున్నాం గదా? అలాగే వారూ రక్షణ పొందుతారు.”

పౌలు బర్నబాల సాక్ష్యం

12అప్పుడు బర్నబా, పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల్లో చేసిన సూచకక్రియలనూ మహత్కార్యాలనూ వివరిస్తుంటే సభ అంతా నిశ్శబ్దంగా ఆలకించింది.

యాకోబు సమీక్ష

13వారు చెప్పడం ముగించిన తరువాత యాకోబు లేచి ఇలా అన్నాడు, “సోదరులారా, నా మాట వినండి. 14యూదేతరుల్లో నుండి దేవుడు తన నామంలో ఒక జనాన్ని ఏర్పరచుకోడానికి వారిని మొదట ఎలా కటాక్షించాడో సీమోను తెలియజేశాడు. 15ఇందుకు ప్రవక్తల మాటలు సరిపోతున్నాయి. ఎలాగంటే,

16‘ఆ తరువాత నేను తిరిగి వస్తాను.

మనుషుల్లో మిగిలినవారూ,

నా నామం ఎవరైతే ధరించారో

ఆ యూదేతరులందరూ, ప్రభువును వెదకేలా

17పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నిర్మిస్తాననీ పాడైన వాటిని తిరిగి కట్టి వాటిని నిలబెడతాననీ

18అనాదికాలం నుండి ఈ సంగతులను తెలియజేసిన ప్రభువు సెలవిస్తున్నాడు’

అని రాసి ఉంది.

యూదేతరులను ధర్మశాస్త్రం కిందికి తేకూడదు

19“కాబట్టి యూదేతరుల్లో నుండి దేవుని వైపు తిరిగే వారిని మనం కష్టపెట్టకుండా 20విగ్రహ సంబంధమైన అపవిత్రతనూ జారత్వాన్నీ విసర్జించాలనీ, గొంతు నులిమి చంపిన దాన్ని, రక్తాన్నీ తినకూడదనీ, వారికి ఉత్తరం రాసి పంపాలని నా అభిప్రాయం. 21ఎందుకంటే, సమాజ మందిరాల్లో ప్రతి విశ్రాంతిదినాన మోషే లేఖనాలను చదువుతూ తరతరాల నుండి దాన్ని ప్రకటించే వారు ప్రతి పట్టణంలో ఉన్నారు” అని చెప్పాడు.

22అప్పుడు సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అనే పేరున్న యూదానూ సీలనూ ఎన్నుకుని, పౌలు, బర్నబాలతో అంతియొకయ పంపడం మంచిదని అపొస్తలులకూ పెద్దలకూ సంఘమంతటికీ తోచింది.

23వారు ఇలా రాసి పంపారు, “అపొస్తలులూ పెద్దలూ సోదరులూ అయిన మేము అంతియొకయ, సిరియా, కిలికియలోని యూదేతరులైన సోదరులకు, శుభాకాంక్షలతో చెప్పి రాస్తున్నది, 24కొందరు మా దగ్గర నుండి వెళ్ళి తమ బోధతో మిమ్మల్ని గాబరా పెట్టి, మీ మనసులను చెరుపుతున్నారని విన్నాం. వారికి మేము ఏ అధికారమూ ఇవ్వలేదు. 25కాబట్టి కొందరిని ఎన్నుకొని, మన ప్రభువైన యేసు క్రీస్తు కోసం ప్రాణాలకు తెగించిన బర్నబా, పౌలు అనే 26మన ప్రియ మిత్రులతో కూడా వారిని మీ దగ్గరికి పంపడం మంచిదని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది. 27అందు వలన యూదానూ సీలనూ పంపుతున్నాం. వారు కూడా నోటిమాటతో ఈ విషయాలు మీకు తెలియజేస్తారు.

28‘విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి’ 29అనే తప్పనిసరైన వీటి కంటే ఎక్కువైన ఏ భారాన్నీ మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకూ మాకూ అనిపించింది. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే అది మీకు మేలు. సెలవు.”

30ఆ పైన వారు వీడ్కోలు పలికి అంతియొకయ వచ్చి శిష్యులను సమకూర్చి ఆ ఉత్తరం ఇచ్చారు. 31వారు దాన్ని చదువుకొని ప్రోత్సాహం పొంది సంతోషించారు. 32యూదా, సీల కూడా ప్రవక్తలైనందున వారు చాలా మాటలతో సోదరులను ఆదరించి బలపరిచారు. 33వారు అక్కడ కొంతకాలం గడిపిన తరువాత, వారిని పంపిన 34వారి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి, సోదరులు వారిని ప్రశాంతంగా సాగనంపారు. 35అయితే పౌలు బర్నబాలు అంతియొకయలోనే ఉండి అనేకమందికి ప్రభువును బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు.

పౌలు రెండవ సువార్త ప్రయాణం

36కొన్ని రోజులైన తరువాత పౌలు “ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్కు ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, వారెలా ఉన్నారో చూద్దాం” అని బర్నబాతో అన్నాడు.

37అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. 38అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకొని పోవడం భావ్యం కాదని తలంచాడు. 39ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. బర్నబా, మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి సైప్రస్ వెళ్ళాడు.

40పౌలు సీలను ఎంపిక చేసుకుని, సోదరులు తనను ప్రభువు కృపకు అప్పగించగా బయలుదేరి, 41సంఘాలను బలపరుస్తూ సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశాడు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index