Search form

అపొస్తలుల కార్యములు 23

సన్హెడ్రిన్ సభ ముందు పౌలు

1పౌలు మహా సభవారిని సూటిగా చూసి, “సోదరులారా, నేను ఈ రోజు వరకూ దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నడచుకొంటున్నాను” అని చెప్పాడు. 2అందుకు ప్రధాన యాజకుడు అననీయ, “అతన్ని నోటి మీద కొట్టండి” అని దగ్గర నిలబడిన వారికి ఆజ్ఞాపించాడు.

3పౌలు అతణ్ణి చూసి, “సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు. నీవు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చుని, ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా?” అన్నాడు. 4అప్పుడు దగ్గర ఉన్నవారు, “నీవు దేవుని ప్రధాన యాజకుణ్ణి దూషిస్తున్నావేంటి?” అన్నారు.

5అందుకు పౌలు, “సోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు.

‘నీ ప్రజల అధికారిని నిందింపవద్దు’

అని రాసి ఉంది” అన్నాడు.

పరిసయ్యుడు పౌలు

6అక్కడ ఉన్న వారిలో ఒక భాగం సద్దూకయ్యులూ, మరొక భాగం పరిసయ్యులూ ఉన్నట్టు పౌలు గ్రహించి, “సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యుల సంతతివాణ్ణి. మనకున్న నిరీక్షణ గూర్చీ, మృతుల తిరిగి బ్రతకడం గూర్చీ నేను విచారణ పాలవుతున్నాను.” అని సభలో గొంతెత్తి చెప్పాడు.

7అతడా విధంగా చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకయ్యులకు మధ్య కలహం రేగింది. అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చీలిపోయింది. 8సద్దూకయ్యులు పునరుత్థానం లేదనీ, దేవదూత గానీ, ఆత్మగానీ లేదనీ చెబుతారు. కాని పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయంటారు. 9అప్పుడు పెద్ద గోల పుట్టింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, “ఈ మనిషిలో ఏ దోషమూ మాకు కనబడలేదు. బహుశా ఒక ఆత్మగానీ, దేవదూతగానీ అతనితో మాట్లాడి ఉండవచ్చు” అని వాదించారు.

10కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి, “వారి మధ్య నుండి అతణ్ణి బలవంతంగా పట్టుకొని కోటలోకి తీసుకుని రండి” అని సైనికులకు ఆజ్ఞాపించాడు.

ప్రభువు ఆదరణ వాక్కులు

11ఆ రాత్రి ప్రభువు అతని పక్కన నిలబడి “ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదే విధంగా రోమ్ నగరంలో కూడా చెప్పాల్సి ఉంటుంది” అని చెప్పాడు.

12తెల్లవారిన తరువాత కొందరు యూదులు పోగై, తాము పౌలుని చంపేటంత వరకూ అన్నపానాలు ముట్టం అని ఒట్టు పెట్టుకొన్నారు. 13నలభై కంటే ఎక్కువమంది ఈ కుట్రలో చేరారు. 14వారు ప్రధాన యాజకుల దగ్గరకూ, పెద్దల దగ్గరకూ వచ్చి, “మేము పౌలును చంపేవరకూ ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొన్నాం. 15కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనిని క్షుణ్ణంగా విచారించాలి అన్న వంకతో అతణ్ణి మీ దగ్గరికి తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు మీ దగ్గరకి రాకముందే మేము అతనిని చంపడానికి సిద్ధపడి ఉన్నాం” అని చెప్పారు.

16అయితే పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్నారని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలియజేశాడు. 17అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకి తీసుకు వెళ్ళు. ఇతడు అతనితో ఒక మాట చెప్పాల్సి ఉంది” అన్నాడు. 18శతాధిపతి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరికి తీసుకుని పోయి, “ఖైదీగా ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి నీ దగ్గరికి తీసుకుపొమ్మని అడిగాడు. ఇతడు నీతో ఒక మాట చెప్పుకోవాలట” అని చెప్పాడు.

19సహస్రాధిపతి ఆ యువకుడి చెయ్యి పట్టుకొని అవతలికి తీసుకుపోయి, ‘నీవు నాతో చెప్పాలనుకొన్న సంగతి ఏమిటి?’ అని ఒంటరిగా అడిగాడు. 20అందుకతడు, “నువ్వు పౌలును పూర్తిగా విచారించడం కోసం అతణ్ణి రేపు మహాసభ దగ్గరికి తీసుకురావాలని నిన్ను బతిమాలడానికి యూదులు ఎదురు చూస్తున్నారు. 21వారి విన్నపానికి ఒప్పుకోవద్దు. ఎందుకంటే వారిలో నలభై కంటే ఎక్కువమంది అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతణ్ణి చంపేదాకా అన్నపానాలు ముట్టకూడదని ఒట్టు పెట్టుకొన్నారు. ఇప్పుడు నీ మాట కోసం కనిపెట్టుకొని ఉన్నారు” అని చెప్పాడు. 22అప్పుడు ఆ సహస్రాధిపతి, “నువ్వు ఈ సంగతి నాకు తెలిపినట్టు ఎవరితోనూ చెప్పవద్దు” అని హెచ్చరించి పంపేశాడు.

కైసరయకు పౌలు

23తరువాత అతడు ఇద్దరు శతాధిపతులను పిలిచి, “కైసరయ వరకూ వెళ్ళడానికి రెండు వందల మంది సైనికులనూ డెబ్భై మంది గుర్రపురౌతులనూ రెండు వందలమంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకల్లా సిద్ధపరచండి. 24గవర్నర్ ఫేలిక్సు దగ్గరికి తీసుకుపోవడానికి గుర్రాలను ఏర్పాటు చేయండి” అని చెప్పాడు. 25అతడు ఈ విధంగా ఒక ఉత్తరం కూడా రాశాడు,

26“అత్యంత గౌరవనీయులైన గవర్నర్ ఫేలిక్సుకు, క్లాడియస్ లూసియస్ వందనాలు. 27యూదులు ఈ వ్యక్తిని పట్టుకొని చంపబోతుండగా, అతడు రోమీయుడని విని, సైనికులతో వెళ్ళి అతణ్ణి తప్పించాను. 28వారు అతని మీద మోపిన నేరమేమిటో తెలుసుకోవాలని నేను వారి మహాసభకు అతణ్ణి తీసుకువెళ్ళాను. 29వారు తమ ధర్మశాస్త్ర వాదాలను గూర్చి ఏవో నేరాలు అతని మీద మోపారు తప్ప మరణానికి గాని, చెరసాలకు గాని తగిన నేరమేదీ అతనిలో చూపలేదు. 30అయితే వారు ఈ వ్యక్తిని చంపడానికి కుట్ర చేస్తున్నారని నాకు తెలిసి, వెంటనే అతణ్ణి మీ దగ్గరికి పంపించాను. నేరం మోపినవారు కూడా అతని మీద చెప్పాలనుకున్న సంగతిని మీ ముందే చెప్పుకోవాలని ఆజ్ఞాపించాను.”

31కాబట్టి సహస్రాధిపతి సైనికులకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు పౌలుని రాత్రి పూట అంతిపత్రి తీసుకువెళ్ళారు. 32మరునాడు వారు గుర్రపు రౌతులను పౌలుతో పంపి తమ కోటకు తిరిగి వెళ్ళారు. 33వారు కైసరయ వచ్చి గవర్నరుకి ఆ ఉత్తరాన్ని అప్పగించి పౌలును అతని ముందు నిలబెట్టారు. 34గవర్నర్ ఆ ఉత్తరం చదివి ఇతడు ఏ ప్రాంతపు వాడని అడిగాడు. కిలికియకు చెందినవాడని తెలుసుకుని, 35“నీ మీద నేరం మోపిన వారు కూడా వచ్చిన తరువాత నీ సంగతి పూర్తిగా విచారిస్తాను” అని చెప్పి, హేరోదు రాజమందిరంలో అతణ్ణి కావలిలో ఉంచాలని ఆజ్ఞాపించాడు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index