Search form

అపొస్తలుల కార్యములు 25

ఫేస్తు ముందు పౌలు

1ఫేస్తు అధికారానికి వచ్చిన మూడు రోజులకు కైసరయ నుండి యెరూషలేము వెళ్ళాడు. 2అప్పుడు ప్రధాన యాజకులూ, యూదుల పెద్దలూ, పౌలు మీద తమ ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేశారు. 3“దయచేసి పౌలును యెరూషలేముకు పిలిపించండి” అని ఫేస్తును వారు కోరారు. ఎందుకంటే వారు అతణ్ణి దారిలో చంపడానికి కాచుకొని ఉన్నారు. 4అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఖైదీగా ఉన్నాడు. నేను త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నాను. 5కాబట్టి మీలో సమర్థులు నాతో వచ్చి అతని మీద నేరమేదైనా ఉంటే మోపవచ్చు” అని జవాబిచ్చాడు.

6అతడు వారి దగ్గర ఎనిమిది లేక పది రోజులు గడిపి కైసరయ వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుని పౌలును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. 7పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడి, ఎన్నో తీవ్ర నేరాలు మోపారు గాని వాటిని రుజువు చేయలేక పోయారు. 8పౌలు, “యూదుల ధర్మశాస్త్రం గూర్చి గానీ, దేవాలయం గూర్చి గానీ, సీజరును గూర్చి గానీ నేనే తప్పూ చేయలేదు” అని జవాబు చెప్పాడు.

9అయితే ఫేస్తు యూదుల చేత మంచి వాడని అనిపించుకోవాలని, “యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు ఈ సంగతులను గూర్చి విచారణకు నిలవడం నీకిష్టమేనా?” అని పౌలును అడిగాడు.

“సీజరు ముందే చెప్పుకొంటాను”

10అందుకు పౌలు, “సీజరు న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నాను. నన్ను విచారణ చేయవలసిన స్థలం ఇదే, యూదులకు నేను ఏ అన్యాయమూ చేయలేదని మీకు బాగా తెలుసు. 11నేను న్యాయం తప్పి మరణానికి తగిన పని ఏదైనా చేసి ఉంటే మరణానికి భయపడను. వీరు నామీద మోపుతున్న నేరాల్లో ఏదీ నిజం కానప్పుడు నన్ను వారికి ఎవరూ అప్పగించడానికి వీలు లేదు. నేను సీజరు ముందే చెప్పుకొంటాను” అన్నాడు. 12అప్పుడు ఫేస్తు తన సలహాదారులతో ఆలోచించి, “సీజరు ముందు చెప్పుకొంటాను అన్నావు కదా, సీజరు దగ్గరకే పంపిస్తాను” అని జవాబిచ్చాడు.

13ఆ తరవాత కొన్ని రోజులకు రాజైన అగ్రిప్ప, బెర్నీకే ఫేస్తును దర్శించడానికి కైసరయ వచ్చారు. 14వారక్కడ చాలా రోజులున్న తరువాత, ఫేస్తు పౌలు గురించి రాజుకు ఇలా చెప్పాడు, “ఫేలిక్సు విడిచిపెట్టి పోయిన ఖైదీ ఒకడు నా దగ్గర ఉన్నాడు. 15నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, యూదుల పెద్దలూ, అతని మీద ఫిర్యాదు చేసి అతణ్ణి శిక్షించమని కోరారు.

16అందుకు నేను, ‘నేరం ఎవరి మీద మోపారో ఆ వ్యక్తి నేరం మోపిన వారికి ముఖాముఖిగా, తన మీద వారు మోపిన నేరం గూర్చి సమాధానం చెప్పుకోడానికి అవకాశం ఇవ్వాలి. అది లేకుండా ఏ మనిషికీ తీర్పు తీర్చడం రోమీయుల పద్ధతి కాదు’ అని జవాబిచ్చాను. 17వారిక్కడికి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయకుండా, మరునాడే న్యాయపీఠం మీద కూర్చుని ఆ వ్యక్తిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాను.

18అయితే నేరం మోపినవారు నేను ఊహించిన నేరాల్లో ఒక్కటి కూడా అతని మీద మోపలేదు. 19కానీ మీ మతం గూర్చీ, చనిపోయిన యేసు అనే ఒకడి గూర్చీ ఇతనితో వారికి కొన్ని వివాదాలున్నట్టు కనబడింది. ఆ యేసు బతికే ఉన్నాడని పౌలు చెబుతున్నాడు. 20నేనలాటి వాదాల విషయం ఏ విధంగా విచారించాలో తోచక, యెరూషలేముకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విచారించడం అతనికి ఇష్టమవుతుందేమోనని అడిగాను.

21అయితే పౌలు, చక్రవర్తి నిర్ణయం వచ్చేదాకా తనను కావలిలో ఉంచాలని చెప్పడం చేత నేనతణ్ణి సీజరు దగ్గరికి పంపించే వరకూ కావలిలో ఉంచమని ఆజ్ఞాపించాను.” 22అందుకు అగ్రిప్ప, “ఆ వ్యక్తి చెప్పుకొనేది నాక్కూడా వినాలనుంది” అన్నాడు. దానికి ఫేస్తు, “రేపు వినవచ్చు” అని చెప్పాడు.

23మరునాడు అగ్రిప్ప, బెర్నీకే ఎంతో ఆడంబరంగా వచ్చి, సైనికాధిపతులతో, పురప్రముఖులతో అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞపై పౌలును తీసుకువచ్చారు. 24అప్పుడు ఫేస్తు, “అగ్రిప్ప రాజా, ఇక్కడ ఉన్న సమస్త ప్రజలారా, మీరు ఈ వ్యక్తిని చూస్తున్నారు గదా. యెరూషలేములోనూ ఇక్కడా యూదులంతా వీడు ఇక బతకకూడదని కేకలు వేస్తూ అతనికి వ్యతిరేకంగా నాకు మనవి చేసుకున్నారు. 25ఇతడు మరణానికి తగిన పని ఏదీ చేయలేదని నేను గ్రహించాను. కానీ ఇతడు చక్రవర్తి ముందు చెప్పుకొంటానని అనడం చేత ఇతనిని అక్కడికే పంపాలని నిశ్చయించాను.

26కానీ ఇతని గూర్చి మన చక్రవర్తికి రాయడానికి నాకు సరైన కారణం ఏమీ కనబడలేదు. కాబట్టి విచారణ అయిన తరువాత రాయడానికి ఏమైనా నాకు దొరకవచ్చని మీ అందరి ఎదుటికి, మరి ముఖ్యంగా అగ్రిప్ప రాజా, మీ ఎదుటికి ఇతనిని రప్పించాను. 27ఖైదీ మీద మోపిన నేరాలను వివరించకుండా అతనిని పంపడం సమంజసం కాదని నా ఉద్దేశం” అని వారితో చెప్పాడు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index