Search form

కొలొస్సయులకు 1

1దేవుని సంకల్పం ప్రకారం యేసు క్రీస్తుకు అపొస్తలుడైన పౌలూ సోదరుడు తిమోతీ కొలస్సై పట్టణంలో ఉన్న పరిశుద్ధులకూ, 2క్రీస్తులో విశ్వాసముంచిన సోదరులకూ శుభాకాంక్షలతో రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుండి కృపా శాంతీ మీకు కలుగు గాక!

3-5పరలోకంలో మీకోసం భద్రంగా ఉంచిన నిరీక్షణనుబట్టి మీరు క్రీస్తు యేసుపై నిలిపిన విశ్వాసాన్ని గూర్చీ, పరిశుద్ధులందరి పట్ల మీరు చూపుతున్నప్రేమను గూర్చీ, మేము విని మీ గురించి ప్రార్థన చేసే ప్రతిసారీ మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సత్యవాక్కు అయిన సువార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ నిరీక్షణను గూర్చి మొదటిసారి మీరు విన్నారు.

6ఈ సువార్త మీరు విని దేవుని కృపను నిజంగా తెలుసుకున్నప్పటి నుంచీ అది మీలో ఫలించి అభివృద్ధి చెందినట్టే ప్రపంచమంతటా ఈ సువార్త ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంది. 7ప్రియమైన మా తోటి దాసుడూ, యేసుక్రీస్తుకు నమ్మకమైన సేవకుడూ అయిన ఎపఫ్రా మీకీ విషయాలు బోధించాడు. 8ఆత్మలో మీ ప్రేమను గూర్చి మాకు తెలియజేసింది కూడా ఇతనే.

9ఈ కారణం చేత మీ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. 10ప్రతి మంచి కార్యం విషయంలోనూ మీరు ఫలిస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానంలో పెరుగుతూ, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేలా, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము ప్రార్ధిస్తున్నాం. 11మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.

12వెలుగు నివాసులైన పరిశుద్ధుల వారసత్వంలో మనల్ని భాగస్వాముల్ని చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. 13ఆయన మనల్ని చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలో ఉంచాడు. 14ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి.

15ఆయన అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన మొదటివాడు. 16ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. 17ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.

18సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో అయన ప్రథముడు. 19ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ, 20కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు.

21ఒకప్పుడు మీరు కూడా దేవునికి పరాయివారుగా ఉన్నారు. మీ ఆలోచనల్లోనూ మీరు చేసిన దుష్క్రియల వలనా దేవునికి శత్రువులుగా ఉన్నారు.

22అయితే రక్త మాంసాలున్న క్రీస్తు శరీరంలో మరణం వల్ల ఆయన మిమ్మల్ని తనతో రాజీ చేసుకున్నాడు. తన ఎదుట మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా నిలబెట్టుకోడానికి ఆయన ఇలా చేశాడు. 23ఇది జరగాలంటే మీరు దృఢంగా విశ్వాసంలో సుస్థిరంగా నిలిచి ఉండి, ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికీ, మీకూ ప్రకటించిన సువార్త వల్ల కలిగిన ఆశాభావం నుండి తొలగిపోకుండా ఉండాలి. ఈ సువార్తకు పౌలు అనే నేను సేవకుణ్ణి అయ్యాను.

24ఇప్పుడు మీ కోసం నేను పడుతున్న హింసల్లో సంతోషిస్తున్నాను. సంఘం అనే తన శరీరం కోసం క్రీస్తు పడిన యాతనల్లో కొదువగా ఉన్న వాటిని నా వంతుగా నా శరీరంలో సంపూర్ణం చేస్తున్నాను. 25రహస్య సత్యంగా ఉన్న దేవుని వాక్కును సంపూర్ణంగా తెలియజేయడానికి దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ప్రకారం నేను సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. 26ఈ రహస్యం యుగయుగాలుగా తరతరాలుగా మర్మంగా ఉంది కానీ ఇప్పుడు దేవుడు దాన్ని తెలియజేశాడు. 27అన్యజనుల్లో ఈ మర్మం అనే దివ్య సంపదను తెలియజేయాలని దేవుడు తలంచాడు. ఈ మర్మం మీలో ఉన్న యేసు క్రీస్తే. ఆయనే మహిమను గూర్చిన ఆశాభావం.

28మేము ప్రకటిస్తున్నది ఈయననే. ప్రతి వ్యక్తినీ క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. ఈ ఉద్దేశంతోనే మేము సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాం బోధిస్తున్నాం. 29దీని కోసం నేను శ్రమిస్తూ ఉన్నాను. నాలో బలంగా పని చేస్తున్న ఆయన మహత్తర శక్తిని నేను వినియోగించుకుంటూ ప్రయాసపడుతున్నాను.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index