Search form

గలతీయులకు 1

పలకరింపులు

1మనుషుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపొస్తలుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ, 2నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు. 3తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

4మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు. 5నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌.

లేఖ ముఖ్యాంశం, సందర్భం

6క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 7అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు. 8మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక. 9మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.

10ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా? లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషుల్ని తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషుల్ని తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.

పౌలు ప్రకటించిన సువార్త అతనికి ప్రత్యేకంగా వెల్లడి అయ్యింది, ఇతర అపొస్తలుల నుంచి పొందినది కాదు

11సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి. 12మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.

13నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి. 14అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను. 15అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని 16ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు. 17నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.

18మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను. 19అతనిని తప్ప అపొస్తలుల్లో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.

20నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను చెపుతున్నాను. 21ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వచ్చాను. 22క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ 23“మునుపు మనల్ని హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని, 24వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index