Search form

హెబ్రీయులకు 6

1కాబట్టి క్రీస్తు సందేశం గురించి ప్రారంభంలో మనం విన్న అంశాలను వదలి, మరింత పరిణతి సాధించే దిశగా సాగిపోదాం. నిర్జీవ క్రియల కోసం పశ్చాత్తాప పడటమూ, దేవునిపై విశ్వాసమూ, 2బాప్తీసాలూ, తలపై చేతులుంచడమూ, చనిపోయినవారు పునర్జీవితులు కావడమూ, నిత్య శిక్షా వంటి ప్రాథమిక అంశాలపై మళ్ళీ పునాది వేయకుండా ముందుకు సాగుదాం. 3ఒకవేళ దేవుడు అనుమతిస్తే అలా చేస్తాం.

4-5తమ జీవితాల్లో ఒకసారి వెలుగును పొందిన వారు, పరలోక వరాన్ని అనుభవించినవారు, పరిశుద్ధాత్మలో భాగం పొందినవారు దేవుని శుభవాక్కునూ, రాబోయే కాలం తాలూకు శక్తులనూ రుచి చూసిన వారు ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం. 6ఎందుకంటే దేవుని కుమారుణ్ణి వారే మళ్ళీ సిలువ వేస్తూ ఆయనను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారు.

7ఇది ఎలాగంటే, నేల తరచుగా తనపై కురిసే వాన నీటిలో తడిసి తనను దున్నిన రైతులకు ప్రయోజనకరమైన పంటలనిస్తూ దేవుని దీవెనలు పొందుతుంది. 8అయితే ముళ్ళూ, ముళ్ళ పొదలూ ఆ నేలపై మొలిస్తే అది పనికిరానిదై శాపానికి గురి అవుతుంది. తగలబడిపోవడంతో అది అంతం అవుతుంది.

9ప్రియమైన స్నేహితులారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికీ మీరింతకంటే మంచి స్థితిలోనే ఉన్నారనీ, రక్షణకు సంబంధించిన విషయాల్లో మంచి స్థితిలోనే ఉన్నారనీ గట్టిగా నమ్ముతున్నాం. 10దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు. చేస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమనూ మీ సేవలనూ ఆయన మర్చిపోడు.

11మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో దాని విషయంలో మీలో ప్రతివాడూ సంపూర్ణ నిశ్చయతతో, శ్రద్ధతో చివరి వరకూ సాగాలని మా అభిలాష. 12మీరు మందకొడిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. విశ్వాసంతో, సహనంతో, వాగ్దానాలను వారసత్వంగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.

(3) తెర లోపలికి ప్రవేశించిన మన ప్రధాన యాజకుడు మనల్ని కూడా ప్రవేశపెడతాడు

13దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి, “నా తోడు” అంటూ ప్రమాణం చేశాడు. 14“నిన్ను కచ్చితంగా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని విస్తారం చేస్తాను” అన్నాడు. 15ఈ విధంగా అబ్రాహాము సహనంతో వేచి ఉన్న తరువాత దేవుడు తనకు వాగ్దానం చేసిన భూమిని పొందాడు.

16సాధారణంగా మనుషులు తమ కంటే గొప్పవాడి తోడు అంటూ ప్రమాణం చేస్తారు. వారికున్న ప్రతి వివాదానికీ పరిష్కారం చూపేది ప్రమాణమే. 17వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.

18అందువల్ల వేటి విషయం దేవుడు అబద్ధం ఆడలేడో, మార్పు లేని ఆ రెండింటి ద్వారా ఆశ్రయం కోరి పరుగు తీసే మన ఎదుట ఉన్న ఆశాభావాన్ని మనం బలంగా పట్టుకోడానికి గట్టి ప్రోత్సాహం ఉండాలని అలా చేశాడు. 19ఈ ఆశాభావం మన ఆత్మలకు చెక్కుచెదరని, స్థిరమైన లంగరు వలే ఉండి తెర లోపలికి ప్రవేశిస్తుంది. 20మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ప్రధాన యాజకుడైన యేసు మన తరపున మనకంటే ముందుగా దానిలో ప్రవేశించాడు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index