Search form

లూకా 18

న్యాయం లేని న్యాయాధికారి ఉపమానం

1తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్ల వేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు.

2“ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. 3ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని దగ్గరికి తరచుగా వచ్చి ‘నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి’ అని అడుగుతూ ఉండేది. 4అతడు ఆమెకు న్యాయం చేయడానికి చాలాకాలం వరకూ ఇష్టపడలేదు. కాని ఆ తరువాత ఇలా అనుకున్నాడు, ‘నేను దేవుడికి భయపడను, మనుషులనూ లెక్కచెయ్యను. 5కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది. కాబట్టి ఆమె మాటిమాటికీ వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను’ అనుకున్నాడు.”

6ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా! 7తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా? వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా? 8ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?”

పరిసయ్యుడు, పన్ను వసూలుదారుడు

9తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10“ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు 13అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

14పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

యేసు చిన్నపిల్లలను దీవించడం (మత్తయి 19:13-15. మార్కు 10:13-16)

15తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు. 16అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు. “పిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆటంకపెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే. 17చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

ధనికుడైన యువ అధికారి (మత్తయి 19:16-30. మార్కు 10:17-31)

18ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. 19అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు. 20వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.

21దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. 22యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. 23అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు. 24యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. 25ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు.

26ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు 27అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు. 28అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.” 29అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి 30ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

యేసు తన మరణ ఉత్థానాల గురించి చెప్పడం (మత్తయి 20:17-19. మార్కు 10:32-34)

31ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. ప్రవక్తలు మనుష్య కుమారుణ్ణి గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి. 32ఆయనను యూదేతరులకు పట్టిస్తారు. వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు. 33ఆయనను కొరడాలతో కొడతారు, చంపివేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పాడు. 34వారికి ఈ మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఈ సంగతి వారికి మర్మంగా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతు బట్టలేదు.

యెరికో దగ్గర గుడ్డివాడికి చూపునివ్వడం (మత్తయి 20:29-34. మార్కు 10:46-52)

35ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. 36పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి, “ఏం జరుగుతోంది?” అని అడిగాడు. 37నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు. 38అప్పుడు వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని కేకలు వేయడం మొదలు పెట్టాడు. 39ముందు నడుస్తున్నవారు, “నోరు మూసుకో” అని గద్దించారు. కానీ వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని మరింత బిగ్గరగా కేకలు వేశాడు.

40అప్పుడు యేసు నిలబడి, వాణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. 41వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, “నీ కోసం నేనేంచేయాలని కోరుతున్నావు?” అని అడిగాడు. దానికి వాడు, “ప్రభూ, నాకు చూపు కావాలి” అన్నాడు. 42దానికి యేసు, “చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు. 43వెంటనే వాడు చూపు పొందాడు. దేవుణ్ణి కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు. ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index