Search form

మత్తయి 2

జ్ఞానుల సందర్శన

1హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు కొందరు యెరూషలేముకు వచ్చి, 2“యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. ఆయనను ఆరాధించడానికి వచ్చాం” అన్నారు.

3హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారుపడ్డారు. 4కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను, ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి, “క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?” అని వారిని అడిగాడు. 5అందుకు వారు, “యూదయ ప్రాంతంలోని బేత్లెహేములోనే. ఎందుకంటే,

6‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా!

యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు.

నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు.

7అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రం కనిపించిన కచ్చితమైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు. 8తరవాత వారిని బేత్లెహేముకు పంపుతూ, “మీరు వెళ్ళి, ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి. మీరు ఆయనను కనుగొన్నాక నాకు చెప్పండి. అప్పుడు నేనూ వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పాడు.

9వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది.

10ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు. 11ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు. 12హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు.

ఈజిప్టుకు పలాయనం

13వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “లేచి బాలుణ్ణీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను నీకు మళ్ళీ చెప్పే వరకూ అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ బాలుణ్ణి చంపాలని వెదకబోతున్నాడు” అని అతనితో చెప్పాడు. 14యోసేపు లేచి, రాత్రి వేళ బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు తరలిపోయాడు. 15హేరోదు చనిపోయే వరకూ అక్కడే ఉండిపోయాడు.

‘ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను’

అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.

పసి పిల్లల వధ

16ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో, దాని పరిసర గ్రామాలన్నిటిలో రెండేళ్ళు, అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు.

17-18“ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది.

రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది.

వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది”

అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి.

ఈజిప్టు నుంచి నజరేతుకు రాక (లూకా 2:39,40)

19హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు కలలో కనబడి, 20“లేచి, బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. బాలుడి ప్రాణం తీయాలని చూసేవారు చనిపోయారు” అని చెప్పాడు. 21అప్పుడు యోసేపు లేచి పిల్లవాణ్ణీ తల్లినీ ఇశ్రాయేలు దేశానికి తీసుకు వచ్చాడు.

22అయితే అర్కెలా తన తండ్రి హేరోదు స్థానంలో యూదయ ప్రాంతాన్ని పాలిస్తున్నాడని విని, అక్కడికి వెళ్ళడానికి యోసేపు భయపడ్డాడు. దేవుడు అతన్ని కలలో హెచ్చరించగా గలిలయ ప్రాంతానికి వెళ్ళి, 23నజరేతు అనే ఊరిలో నివసించాడు. యేసును నజరేయుడు అని పిలుస్తారు అని ప్రవక్తలు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index