Search form

మత్తయి 8

యేసు కుష్టురోగిని బాగు చేయడం

1ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను అనుసరించారు. 2ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు. 3యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి, “నాకిష్టమే, నువ్వు బాగుపడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది. 4అప్పుడు యేసు అతనితో, “చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. వెళ్ళి యాజకుడికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే నియమించిన కానుక అర్పించు” అని చెప్పాడు.

యేసు శతాధిపతి సేవకుణ్ణి బాగు చేయడం (లూకా 7:1-10)

5యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, 6“ప్రభూ, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు. 7“నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనికి జవాబిచ్చాడు. 8ఆ శతాధిపతి, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. నా పనివాడు బాగుపడతాడు. 9నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే. నా చేతి కింద కూడా సైనికులున్నారు. నేను ఎవడినైనా ‘వెళ్ళు’ అంటే వాడు వెళ్తాడు. ఎవడినైనా ‘రా’ అంటే వాడు వస్తాడు. నా పనివాణ్ణి ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని జవాబిచ్చాడు.

10యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను. 11తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో విందులో కూర్చుంటారు. 12అయితే రాజ్య కుమారులను మాత్రం బయట చీకట్లోకి తోసేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.” 13యేసు శతాధిపతితో, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది” అన్నాడు. ఆ క్షణంలోనే అతని పనివాడు బాగుపడ్డాడు.

పేతురు అత్తకు స్వస్థత (మార్కు 1:29-34. లూకా 4:38-41)

14తరవాత యేసు, పేతురు ఇంట్లోకి వెళ్ళి, జ్వరంతో పడుకుని ఉన్న అతని అత్తను చూశాడు. 15యేసు ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను విడిచి పోయింది. అప్పుడామె లేచి ఆయనకు సేవ చేయసాగింది.

16సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు. 17యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే,

“ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు.

మన రోగాలను భరించాడు.”

18యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపులను చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు.

శిష్యులుగా ఉండగోరే వారికి పరీక్ష (లూకా 9:57-62)

19అప్పుడు ధర్మశాస్త్ర పండితుడు ఒకడు వచ్చి, “బోధకా! నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను నీ వెంటే వస్తాను” అన్నాడు. 20అందుకు యేసు అతనితో, “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు” అన్నాడు. 21ఆయన శిష్యుల్లో మరొకడు, “ప్రభూ, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి” అని ఆయనను అడిగాడు. 22అయితే యేసు అతనితో, “నాతో రా. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి చనిపోయిన వారు ఉన్నారులే!” అన్నాడు.

యేసు తుఫానును ఆపడం (మార్కు 4:36-41. లూకా 8:22-25)

23ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు. 24అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు. 26యేసు వారితో, “అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది. 27శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.

గదరా ప్రదేశంలో యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం (మార్కు 5:1-21. లూకా 8:26-40)

28ఆయన అవతలి ఒడ్డున ఉన్న గదరేనీయుల ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తులు సమాధుల్లో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురు వచ్చారు. వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడం వలన ఎవరూ ఆ దారిన వెళ్ళలేక పోయేవారు. 29ఆ దయ్యాలు, “దైవకుమారా, నీతో మాకేంటి? మా కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశారు.

30వారికి కొంత దూరంలో పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. 31“నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే, ఆ పందుల మందలోకి పోనియ్యి” అని ఆ దయ్యాలు యేసును ప్రాధేయపడ్డాయి. 32యేసు, “సరే, పో” అని వాటితో అన్నాడు. అవి బయటికి వచ్చి ఆ పందుల మందలోకి చొరబడ్డాయి. వెంటనే ఆ మంద అంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ పోయి సముద్రంలో పడి చచ్చాయి.

33ఆ పందుల మందను కాసేవారు పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి జరిగిన సంగతి, ఇంకా దయ్యాలు పట్టిన వాడికి జరిగిన సంగతీ తెలియజేశారు. 34అప్పుడు ఆ ఊరి వారంతా యేసును కలవడానికి వచ్చారు. ఆయనను చూసి తమ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపొమ్మని ఆయనను బతిమాలారు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index