Search form

ప్రకటన గ్రంథము 16

దేవుని ఉగ్రత పాత్రలు

1అప్పుడు ఒక పెద్ద స్వరం అతి పరిశుద్ధ స్థలంలో నుంచి, “మీరు వెళ్ళి ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని భూమి మీద కుమ్మరించండి” అని ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పడం విన్నాను.

మొదటి పాత్ర

2అప్పుడు మొదటి దూత బయటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించాడు. అప్పుడు ఆ క్రూరమృగానికి చెందిన ముద్ర వేసుకున్న వారికీ, వాడి ప్రతిమను పూజించే వారికీ ఒంటిపై బాధాకరమైన వికారమైన కురుపు పుట్టింది.

రెండవ పాత్ర

3రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించాడు. సముద్రమంతా చచ్చిన మనిషి రక్తంలా మారిపోయింది. దాంతో సముద్రంలోని ప్రాణులన్నీ చచ్చాయి.

మూడవ పాత్ర

4మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు ఆ నీళ్లన్నీ రక్తం అయ్యాయి. 5-6అప్పుడు నీటికి అధిపతిగా ఉన్న దూత, “పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధుల రక్తాన్నీ, ప్రవక్తల రక్తాన్నీ వారు ఒలికించారు. అందుకే నువ్వు వారికి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు గనక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వారు అర్హులే.” అని చెప్పాడు. 7అప్పుడు బలిపీఠం, “అవును, ప్రభూ దేవా, సర్వశక్తి శాలీ, నువ్వు చెప్పే తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి” అంది.

నాలుగవ పాత్ర

8నాలుగవ దూత తన పాత్రను సూర్యుడిపై కుమ్మరించాడు. అప్పుడు మనుషుల్ని తన వేడితో మాడ్చివేయడానికి సూర్యుడికి అధికారం కలిగింది. 9మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును దూషించారు గానీ పశ్చాత్తాపపడి ఆయనకు మహిమ కలిగించ లేదు.

ఐదవ పాత్ర

10అయిదవ దూత తన పాత్రను క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు. 11అయితే తమకు కలిగిన వేదనలను బట్టీ, కురుపులను బట్టీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి తిట్టారే తప్ప తమ క్రియలు మాని పశ్చాత్తాప పడలేదు.

ఆరవ పాత్ర

12ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్ళు ఎండిపోయాయి.

అదనపు వివరణ

13అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లా కనిపిస్తున్న మూడు అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను. 14అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి.

15“వినండి! నేను దొంగలా వస్తున్నాను. పదిమందిలో సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా, బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్తగా ఉండి దుస్తులు ధరించి ఉండేవాడు దీవెన పొందుతాడు.”

16హీబ్రూ భాషలో ‘హర్ మెగిద్దోన్’ అనే పేరున్న స్థలానికి ఆ రాజులందర్నీ పోగు చేశారు.

ఏడవ పాత్ర

17ఏడవ దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండీ సింహాసనం నుండీ, “ఇక అయిపోయింది” అని ఒక పెద్ద శబ్దం వినిపించింది. 18అప్పుడు వివిధ శబ్దాలూ, మెరుపులూ, భారీ ఉరుములూ కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన దగ్గర్నుండీ అలాంటి భూకంపం కలగలేదు. అంత పెద్ద భూకంపం అది.

19ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు. 20ప్రతి ద్వీపమూ అదృశ్యమైపోయింది. ప్రతి పర్వతం కనిపించకుండా పోయింది. 21ఆకాశం నుండి మనుషుల మీద సుమారు నలభై ఐదు కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయంకరంగా ఉంది కాబట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index