Search form

ప్రకటన గ్రంథము 22

పరలోకం, జీవజలనది

1అప్పుడు జీవజలనదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం నుండీ, 2ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. అది నెల నెలా ఫలిస్తూ, ఏడాదికి పన్నెండు కాపులు ఇస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి.

3అక్కడ ఇక శాపం అనేది ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనకు సేవ చేస్తారు. 4ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళపై ఉంటుంది. 5రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు.

6ఆ దూత నాతో ఇలా చెప్పాడు, “ఈ మాటలు నమ్మదగ్గవి, సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలో జరగాల్సిన వాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు.” 7“చూడండి! నేను త్వరగా వస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను స్వీకరించేవాడు ధన్యుడు.”

8యోహాను అనే నేను ఈ సంగతులన్నీ విన్నాను, చూశాను. అలా నేను వింటూ చూస్తూ ఉన్నప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దూతను పూజించడానికి అతని ఎదుట సాష్టాంగపడ్డాను. 9అప్పుడు అతడు, “అలా చెయ్యకు. నేను నీకూ, నీ సోదరులకూ, ప్రవక్తలకూ, ఈ పుస్తకంలో మాటలను పాటించే వారందరికీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు” అని చెప్పాడు.

10అతడు నాతో ఇంకా ఇలా చెప్పాడు, “ఈ పుస్తకంలో ఉన్న ప్రవచన వాక్కులను మూసి ముద్ర వేయవద్దు. ఎందుకంటే సమయం దగ్గర పడింది. 11అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూనే ఉండనియ్యి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనియ్యి. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనియ్యి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగా ఉండనియ్యి.

12“చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది.

13ఆల్ఫా, ఓమెగా నేనే. మొదటి వాణ్ణి, చివరి వాణ్ణి నేనే. ప్రారంభాన్నీ ముగింపునీ నేనే.

14జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.

15పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.

16యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ.

17“రా” అంటూ ఆత్మా, పెళ్ళికూతురూ చెబుతున్నారు. వింటున్నవాడూ, “రా” అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు.”

18ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను వినే ప్రతి వ్యక్తినీ నేను హెచ్చరించేది ఏమిటంటే ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకంలో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలగజేస్తాడు. 19ఎవడైనా దేనినైనా తీసి వేస్తే దేవుడు ఈ పుస్తకంలో వివరించిన జీవవృక్షంలోనూ, పరిశుద్ధ పట్టణంలోనూ వాడికి భాగం లేకుండా చేస్తాడు.

చివరి వాగ్దానం, చివరి ప్రార్థన

20ఈ సంగతులను గురించి సాక్షమిస్తున్న వాడు, “అవును, త్వరగా వస్తున్నాను” అని అంటున్నాడు.

ఆమేన్‌! ప్రభు యేసూ, త్వరగా రా.

21ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండుగాక. ఆమేన్‌.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index