Search form

ప్రకటన గ్రంథము 3

సార్దీస్‌లో ఉన్న సంఘానికి లేఖ

1“సార్దీస్‌లో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

ఏడు నక్షత్రాలూ దేవుని ఏడు ఆత్మలూ ఉన్నవాడు చెప్పే విషయాలు. నీ పనులు నాకు తెలుసు. బ్రతికి ఉన్నావనే పేరు మాత్రం నీకు ఉంది గానీ నువ్వు చచ్చిన వాడివే. 2జాగ్రత్త పడు. చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచుకో. ఎందుకంటే నీ పనులు నా దేవుని ముందు నాకు సంపూర్ణంగా కనిపించడం లేదు. 3కాబట్టి నీవు ఉపదేశం ఎలా పొందావో, ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకో. దానినే ఆచరించి పశ్చాత్తాప పడు. నువ్వు మేలుకొనక పోతే, నేను దొంగలా వస్తాను. ఏ సమయంలో వస్తానో నీకు ఎంతమాత్రం తెలియదు.

4అయితే సార్దీస్ లో నీ దగ్గర ఉన్నవారిలో కొందరు తమ బట్టలు మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు. కాబట్టి వారు తెల్లటి బట్టలు వేసుకుని నాతో కలసి నడుస్తారు. 5జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను. 6చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినుగాక.“

ఫిలదెల్ఫియలో ఉన్న సంఘానికి లేఖ

7“ఫిలదెల్ఫియలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

సత్యం మూర్తీభవించిన వాడూ పరిశుద్ధుడూ దావీదు తాళం చెవులను చేత పట్టుకున్న వాడు; తెరిచాడంటే ఎవరూ మూయలేరు, మూశాడంటే ఎవరూ తీయలేరు, అలాటి ఈయన చెప్పే విషయాలేమిటంటే, 8నీ పనులు నాకు తెలుసు. చూడు, నీ ఎదుట తలుపు తీసి ఉంచాను. దాన్ని ఎవరూ మూయలేరు. నీ బలం స్వల్పమే అయినా నా వాక్కుకు విధేయత చూపావు. నా నామాన్ని తిరస్కరించలేదు. 9సాతాను సమాజానికి చెందినవారై ఉండి, మేము యూదులమే అని అబద్ధమాడే వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ కాళ్ళపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థం అయ్యేలా చేస్తాను. 10ఓర్పుతో సహించాలన్న నా ఆదేశానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి భూమిపై నివసించే వారిని పరిశోధించడానికి లోకం మీదికి రాబోయే పరీక్షా కాలంలో నేను నిన్ను కాపాడతాను.

11నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటాన్ని ఎవరూ తీసుకోకుండా నీకున్న దాన్ని గట్టిగా పట్టుకో. 12జయించేవాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులో నుండి అతడు ఇక ఎప్పటికీ బయటకు వెళ్ళడు. నా దేవుని పేరునూ పరలోకంలో నా దేవుని దగ్గర నుండి వస్తున్న నా దేవుని పట్టణమైన కొత్త యెరూషలేము పేరునూ నా కొత్త పేరునూ అతనిపై రాస్తాను. 13చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినుగాక.“

లవొదికయలో ఉన్న సంఘానికి లేఖ

14“లవొదికయలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

ఆమేన్‌ అనే పేరున్న వాడూ నమ్మకమైన సత్యసాక్షీ దేవుని సృష్టికి మూలం అయిన వాడూ చేసే ప్రకటన ఏమిటంటే, 15నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో, వేడిగానో ఉంటే మంచిది. 16నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండాా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను. 17‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.

18నా సలహా విను, నీకు సంపద పెరగడం కోసం కొలిమిలో కరగబెట్టిన బంగారాన్నీ, నీ నగ్నత్వం కనిపించి నీ సిగ్గు పోకుండా ధరించడానికి తెల్లని వస్త్రాలనూ, నీవు చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో. 19నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.

20చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను లోపలికి అతని దగ్గరికి వస్తాను. నేను అతనితో కలసి భోజనం చేస్తాను. అతడూ నాతో కలసి భోజనం చేస్తాడు. 21నేను విజయం సాధించి నా తండ్రితో కలసి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టే జయించేవాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిస్తాను.

22చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినుగాక.”

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index